Esther 6

1ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. అతడు తన పరిపాలన విశేషాలు రాసి ఉండే గ్రంథం తీసుకు రమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. వారు తెచ్చి దాన్ని రాజుకు చదివి వినిపించారు. 2ద్వారపాలకులు బిగ్తాను, తెరెషు అనే ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంపడానికి కుట్ర పన్నిన సంగతి మొర్దెకై బయట పెట్టి తెలియజేసినట్టు అందులో రాసి ఉంది.

3రాజు ఆ సంగతి విని <<మరి దీని కోసం మొర్దెకైకి సన్మానంగా, గుర్తింపుగా ఏదైనా చేశామా?>> అని అడిగాడు. రాజు సేవకులు, <<అతనికేమీ చేయలేదు>> అని జవాబిచ్చారు.

4అప్పుడు <<ఆవరణంలో ఉన్నది ఎవరు?>> అని రాజు అడిగాడు. అప్పటికి హామాను తాను చేయించిన ఉరి కొయ్య మీద మొర్దెకైని ఉరి తీయించడానికి రాజు అనుమతి అడగడానికి రాజ భవంతి ఆవరణంలోకి వచ్చి ఉన్నాడు. 5రాజ సేవకులు, <<అయ్యా, హామాను ఆవరణంలో నిలబడి ఉన్నాడు>> అని రాజుతో చెప్పారు. రాజు <<అతన్ని రానియ్యండి>> అన్నాడు. హామాను లోపలికి వచ్చాడు.

6<<రాజు ఎవరినైనా గొప్ప చేసి సత్కరించాలనుకుంటే ఏమి చేయాలి?>> అని రాజు అతన్ని అడిగాడు. హామాను <<నన్ను గాక రాజు మరి ఇంకెవరిని గొప్ప చేయాలనుకుంటాడు?>> అని తనలో తాను అనుకుని రాజుతో ఇలా అన్నాడు,

7<<రాజు సత్కరించాలని కోరిన వాడికి ఇలా చెయ్యాలి. 8రాజు ధరించుకునే రాజవస్త్రాలను, రాజు ఎక్కే గుర్రాన్ని, రాజు తన తలపై పెట్టుకునే రాజకిరీటాన్ని తేవాలి. 9ఆ వస్త్రాలనూ ఆ గుర్రాన్నీరాజు ఉన్నతాధికారుల్లో ఒకడికి అప్పగించాలి. రాజు గొప్ప చేయాలని కోరుకున్న వ్యక్తికి ఆ వస్త్రాలు తొడిగి ఆ గుర్రం మీద అతణ్ణి ఎక్కించి రాజవీధిలో ఊరేగిస్తూ <రాజు గొప్ప చేయాలని కోరిన వాడికి ఈ విధంగా చేస్తారు> అని అతని ముందు నడుస్తూ చాటించాలి.>>

10వెంటనే రాజు, <<అయితే తొందరగా వెళ్లి నువ్వు చెప్పినట్టే ఆ వస్త్రాలనూ ఆ గుర్రాన్నీ తీసుకుని రాజ ద్వారం దగ్గర కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి ఆ విధంగా చెయ్యి. నువ్వు చెప్పిన వాటిలో ఏదీ తక్కువ కానియ్యకుండా అంతా చెయ్యి>> అని హామానుకు ఆజ్ఞాపించాడు. 11హామాను ఆ వస్త్రాలను, గుర్రాన్నీ తెచ్చి మొర్దెకైకి ఆ బట్టలు తొడిగి ఆ గుర్రం మీద అతన్ని కూర్చోబెట్టి రాజ వీధిలో నడిపిస్తూ, <<రాజు గొప్ప చేయాలని కోరే వాడికి ఇలా జరుగుతుంది>> అని అతని ముందర నడుస్తూ చాటించాడు.

12తరువాత మొర్దెకై రాజు ద్వారం దగ్గరికి తిరిగి వచ్చాడు. హామాను మాత్రం తలపై గుడ్డ కప్పుకుని హతాశుడై గబగబా ఇంటికి వెళ్లి పోయాడు. 13హామాను తనకు పట్టిన గతి తన భార్య జెరెషుకు, తన స్నేహితులందరికీ చెప్పాడు. అతని దగ్గర ఉన్న జ్ఞానులు, అతని భార్య జెరెషు, <<ఎవరి ఎదుట నీవు పడిపోవడం మొదలయిందో ఆ మొర్దెకై యూదు జాతివాడైతే గనక అతన్ని నీవు ఓడించలేవు. అతని చేతుల్లో నీకు పతనం తప్పదు>> అని ఆతనితో అన్నారు.

వారు ఇంకా మాట్లాడుతూ ఉండగానే రాజుగారి ఉద్యోగులు వచ్చి ఎస్తేరు ఏర్పాటు చేసిన విందుకు రమ్మని హామానును తొందర పెట్టారు.

14

Copyright information for TelULB